ప్రపంచకప్‌లో టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్‌కు తీవ్ర గాయం

  • మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత ఆల్‌రౌండర్‌కు గాయం
  • ఫీల్డింగ్ చేస్తూ చీలమండ బెణకడంతో మైదానం వీడిన శ్రేయాంక
  • స్ట్రెచర్‌పై మైదానం నుంచి బయటకు తీసుకెళ్లిన వైద్య సిబ్బంది
  • ఈ మ్యాచ్‌లో భారత్ 95 పరుగుల తేడాతో ఘన విజయం
మహిళల టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత మహిళా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో కీలక ఆల్‌రౌండర్‌గా ఉన్న శ్రేయాంక పాటిల్ ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డారు. నిన్న హెడింగ్లీ మైదానంలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ 95 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించినప్పటికీ, శ్రేయాంక గాయం జట్టులో ఆందోళన నింపింది.

నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో ఈ ప్రమాదం జరిగింది. మిడ్-ఆన్ దిశగా వచ్చిన బంతిని అడ్డుకునే క్రమంలో శ్రేయాంక కుడి కాలి చీలమండ మడవడంతో ఆమె మైదానంలోనే కుప్పకూలారు. తీవ్రమైన నొప్పితో ఆమె విలవిలలాడటంతో జట్టు ఫిజియో తక్షణమే మైదానంలోకి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అయితే, ఆమె కనీసం నిలబడలేని స్థితిలో ఉండటంతో స్ట్రెచర్‌పై మైదానం వెలుపలికి తీసుకెళ్లాల్సి వచ్చింది. అనంతరం గాయం తీవ్రతను అంచనా వేసేందుకు ఆమెను స్కానింగ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సుమారు 14-15 నెలల పాటు వేలి ఫ్రాక్చర్, షిన్ స్ప్లింట్స్ వంటి తీవ్ర గాయాల కారణంగా ఆటకు దూరమైన శ్రేయాంక, ఇటీవలే కోలుకుని జట్టులోకి పునరాగమనం చేశారు. ఇలాంటి కీలక తరుణంలో ఆమె మళ్లీ గాయపడటం జట్టు యాజమాన్యాన్ని కలవరపెడుతోంది. ఈ ఘటనపై స్పందించిన బీసీసీఐ, శ్రేయాంక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, గాయం తీవ్రతపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.                                

Shreyanka Patil
Womens T20 World Cup
India Women Cricket Team
Shreyanka Patil Injury
India vs Netherlands Women
BCCI Update

More Telugu News